Home  »  Bollywood News  »  మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ 'తవ్వై'.. నగల వెనుక దాగున్న భయంకర శాపం ఏంటి?

Updated : Jul 1, 2026

ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. సాధారణ ప్రేమకథలు, కమర్షియల్ యాక్షన్ సినిమాల కంటే పురాణ ఇతిహాసాలు, మిస్టరీ, హారర్ అంశాల కలయికతో వచ్చే మైథలాజికల్ హారర్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో వచ్చిన 'కాంతార', 'విరూపాక్ష' తరహాలోనే సరికొత్త హిందూ సంప్రదాయ నమ్మకాలు, పురాణ గాథల నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త బాలీవుడ్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘తవ్వై’  ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా 'తవ్వై' అంటే హిందీలో దరిద్ర దేవత లేదా దౌర్భాగ్య దేవి అని అర్థం వస్తుంది. లక్ష్మీ దేవి, అలక్ష్మి పురాణాలు, వంశపారంపర్యంగా వచ్చే శాపాలు, హిందూ సంప్రదాయంలో అత్యంత కీలకమైన పితృ దోషం మరియు పవిత్రమైన రావిచెట్టు చుట్టూ తిరిగే మూఢనమ్మకాలను ప్రధానంగా బేస్ చేసుకుని ఈ సినిమాను అద్భుతంగా రూపొందించారు.

ఈ విలక్షణమైన హారర్ సస్పెన్స్ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’ ద్వారా నేరుగా డిజిటల్ రిలీజ్ అయి, జూన్ 29 నుంచి విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. రెండేళ్ల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ టీజర్ విడుదలై సినిమా ప్రేమికుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎట్టకేలకు డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. హిందీ టెలివిజన్ రంగంలో, ముఖ్యంగా స్టార్ ప్లస్ ‘మహాభారతం’ సీరియల్‌లో దుర్యోధనుడి పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్పిత్ రంకా (యతేంద్రగా) ఈ సినిమాలో అత్యంత ప్రధానమైన పాత్రను పోషించారు. ఆయనతో పాటు బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ జోషి (అవధేష్), భూషణ్ ప్రధాన్ (ప్రమేంద్ర), తృప్తి సాహు (దక్షత) లీడ్ క్యారెక్టర్లలో జీవించారు. నిర్భయ్ జరీవాలా మరియు జయేష్ వృశీరాజ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ వ్యయంతో నిర్మించారు.

ఈ సినిమా ప్రధాన కథాంశం 1800ల కాలం నాటి ఒక పురాతన శాపంతో ముడిపడి సాగుతుంది. ఆ శతాబ్దంలో ఒక క్రూరమైన పాలకుడు చేసిన పాపాలు, అమితమైన దురాశ కారణంగా ఒక శక్తివంతమైన దౌర్భాగ్య శాపం పుడుతుంది. ఆ శాపం కాలంతో పాటు కరిగిపోకుండా, న్యాయం జరగని ఒక భయంకరమైన పగలా మారి ఒక నిర్దిష్టమైన వంశానికి చెందిన కుటుంబానికి చుట్టుకుంటుంది. తరాలు మారుతున్నా ఆ దౌర్భాగ్య దేవి రూపంలోని దుష్టశక్తి ఒక పురాతన బంగారు ఆభరణాల పెట్టెను ఆవహించి ఉంటుంది. ఆ బంగారు నగలను ఎవరూ తాకనంతవరకూ ఆ దుష్టశక్తి నిద్రాణంగానే ఉంటుంది. కానీ, ఎప్పుడైతే ఆ వంశానికి చెందిన ఆధునిక కాలపు కుటుంబ సభ్యులు తెలియక ఆ శాపగ్రస్తమైన నగలను ధరిస్తారో, అప్పటినుంచి ఆ దుష్టశక్తి వారిని నానా ఇబ్బందులకు గురిచేస్తూ, ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తుంది. కుటుంబ రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండగా, దేవుడు వర్సెస్ దుష్టశక్తి అన్నట్లుగా సాగే ఈ మైండ్ బ్లోయింగ్ మిస్టరీ నుండి ఆ కుటుంబం ఎలా బయటపడింది అనేదే మిగిలిన కథ. ప్రస్తుతం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ విలక్షణ చిత్రం, సౌత్ ఆడియన్స్ నుంచి వస్తున్న భారీ క్రేజ్ రీత్యా త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్బింగ్ అయి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.